About us

about-img

– ఏపీ లా పాయింట్‌...
ఇది ఆడపిల్లలకు, మహిళలకు న్యాయం–చట్టం పరంగా ఉపయోగపడే విషయాలు చెప్పటానికి నేను చేస్తున్న చిన్న ప్రయత్నం.

– నా పేరు జయలక్ష్మి...
– నన్ను జయశ్రీ అంటారు.

అందరి మాదిరిగానే నేను ఒక సామాన్య మహిళని... ప్రస్తుతం, జగనన్నగారి ప్రభుత్వంలో, ఆయన ఇచ్చిన గుర్తింపు వల్ల ఈ రోజున రాష్ట్ర మహిళా కమిషన్‌ మెంబర్‌ని. నేను చదువుకున్నది... ఎంఏ ఎల్‌ఎల్‌బీ.
నేను చదువుతున్నది... సమాజాన్ని.

ఈ పోర్టల్‌ ఆలోచన నాకు ఎందుకు వచ్చిందో చెపుతాను. మీలాంటి నేను... నాలాంటి మీరు... మొత్తంగా మన ఆడపిల్లలు, ఆక్కచెల్లెమ్మలు, అమ్మలు, పసి పిల్లలు... ఎవరైనా ఎదుర్కొంటున్న సమస్యలను చూసిన తరవాత... నా వంతుగా కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని ఈ పోర్టల్‌ ప్రారంభిస్తున్నాను!

ఒక పేద ఇంట్లో, ఒక మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన ఆడపిల్ల జీవన యానం ఎలా ఉంటుందో ఆ ప్రయాణం చేసినవారికే తెలుస్తుంది. సినిమాలకు, రచనలకు, చివరికి ఊహలకు కూడా అందని అనేక సవాళ్ళు మన ఆడపిల్లలు వారి నిజ జీవితాల్లో ఎదుర్కొంటారు.

ఇలా సవాళ్ళు ఎదుర్కొనే విషయంలో వయసుతో సంబంధం లేదు... కులంతో సంబంధం లేదు... పేదింటి ఆడ పిల్లలు, ఏ అండా లేని ఆడపిల్లలు, మధ్య తరగతి ఆడ పిల్లలు– మహిళలు వీరంతా ఎప్పుడూ జెండర్‌ పరంగా టార్గెట్లే. మహిళలు వారిని వారు రక్షించుకోవటం ఎలా అన్నది కేవలం థియారిటికల్‌ సబ్జెక్ట్‌ కాదు.

సమాజంలో ప్రమాదం ఎక్కడినుంచి ఎదురవుతుంది అని ఆలోచించటం కంటే... రక్షణ ఎక్కడ ఉంది? ఎలా ఉందని ఆలోచించాల్సినంతగా దేశమంతటా, ప్రపంచంలోని అనేక దేశాల్లోనూ పరిస్థితుల్లో దుర్మార్గమైన మార్పులు వస్తున్నాయి. – మానవ హక్కుల ఉద్యమాలు, స్త్రీవాద ఉద్యమాలు, ప్రజాస్వామ్యంలో రాజ్యాంగ రక్షణలు... వాటి వల్ల వచ్చిన మంచి మార్పులు ఒక వంక కనిపిస్తున్నా, పాత–కొత్త సవాళ్లు విడివిడిగా, ఉమ్మడిగా దుర్మార్గంగా కబళించటం కూడా కనిపిస్తోంది.

- మహిళలమీద నేరాలు చేస్తున్న నేరగాళ్ళకు కూడా కులాలూ మతాలూ ఏవీ లేవు. పలుకుబడి, నేరం నుంచి తప్పించుకోగలమన్న నమ్మకం... ఇవే మహిళలమీద నేరాలు చేయిస్తున్నాయి.

  • మహిళను చులకనగా, ఆటబొమ్మగా, బానిసగా చూసే అవకాశం ఉన్నంతకాలం మహిళలమీద నేరాలు జరుగుతూనే ఉంటాయి.
  • సంప్రదాయ నేరాలతోపాటు, టెక్నాలజీ విసిరే నేరాలూ రోజు రోజుకూ పెరిగాయి.
  • రాజ్యాంగం ఏం చెప్పిందన్నది పుస్తకాల్లో చదువుకుంటున్నా... వాస్తవంగా ఏం జరుగుతోందన్నది దశాబ్దాలుగా మనమంతా చూస్తున్నాం.

 

- రాజ్యాంగంలో ఆర్టికల్‌ 12 నుంచి 35 వరకు, పార్ట్‌ 3లో ఇచ్చిన ప్రాథమిక హక్కులన్నీ ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్క ఆడపిల్లకూ ఉన్నాయి.

  • అలాగే, 1956లో వచ్చిన వ్యభిచార, బానితస్వ నిరధక చట్టం...
  • 1956లోనే భరణానికి సంబంచి చేసిన చట్టం...
  • 1961లో వచ్చిన వరకట్న నిరోధక చట్టం...
  • 1971లో గర్భవిచ్ఛిన్నాన్ని నిరోధిస్తూ చేసిన చట్టం
  • 1986లో మహిళల్ని అసభ్యంగా చూపించే ప్రయత్నాలను శిక్షించే చట్టం
  • 1987లో సతీసహగమనాన్ని శిక్షించేందుకు మరోసారి చేసిన చట్టం
  • 2005తో ఇంట్లో మహిళమీద జరిగే హింసను కూడా నేరంగా పరిగణించిన చట్టం...

 

- ఇలా అనేక చట్టాలు పార్లమెంటు ద్వారా ఆమోదం పొందాయి.
- ఇవన్నీ చదివే అవసరంగానీ, అవకాశంగానీ సామాన్య స్త్రీకి ఉండదు.
- వీటిలో కనీసంగా తెలుసుకోవాల్సినవి తెలుసుకునే అవకాశం, ఒక్క లా చదువుకున్న ఆడపిల్లలకు తప్ప, మిగిలిన వారికి ఉండదు. - కానీ చట్టం గురించి కనీస అవగాహన ఉండాలి.
- మన హక్కులు ఏమిటో మనకు తెలియాలి.
- ఇవన్నీ తెలియకపోవటం వల్ల ఏం జరుగుతోందో చూస్తున్నాం...

మహిళల మీద నేరాలనే తీసుకుంటే...
- రికార్డులకు ఎక్కుతున్న నేరాలు పదిలో ఒకటి కంటే తక్కువగా ఉంటాయని అందరూ అంగీకరిస్తున్నారు.
- అయినా అలాంటి నేరాలను ఎన్‌ సీ ఆర్‌ బీ (నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో) ప్రకారంగా చూస్తే... కేవలం ఐపీసీ, రాష్ట్రాల్లో ఉండే స్థానిక చట్టాల ప్రకారం నమోదయిన నేరాలు ఏటికేడాది పెరిగి...

  • 2017లో 3 లక్షల 60 వేలు...
  • 2018లో 3 లక్షల 78 వేలు...
  • 2019లో 4 లక్షల 6 వేలకు చేరాయి...

 

దేశంలో మొత్తం జరుగుతున్న నేరాల్లో దాదాపు 62 శాతానికి పైగా నేరాలు, మహిళలమీదే జరుగుతున్నాయి. అంటే, సమాజం మారిందని, చదువుకునేవారి సంఖ్య పెరిగిందని, ఉద్యోగాలు చేస్తున్న మహిళలు కూడా పెరుగుతున్నారని కనిపిస్తూనే ఉన్నా మహిళలమీద నేరాలు కూడా ప్రతి ఏడాదీ పెరుగుతున్నాయి.

పసిపాప... ఆడపిల్ల... కాలేజీగాళ్‌... వివాహిత... మధ్య వయస్కురాలు... వృద్ధురాలు... వీరందరిమీదా నేరాలు జరుగుతూనే ఉన్నాయి. చివరికి అమ్మ కడుపులో ఉన్న బిడ్డ ఆడపిల్ల అనుకుంటే, ఆమె మీద కూడా నేరాలు జరుగుతున్నాయి. దురదృష్టం ఏమిటంటే... మౌనంగా భరించాలని చెప్పే సమాజం పెద్దది... నోరు తెరిచి ఎదిరించేవారి సంఖ్య, వారికి మద్దతు ఇచ్చేవారి సంఖ్య చిన్నది.

- ఈ నేరాలకు వేయాల్సిన శిక్షలేమిటి?
- ప్రతి ఇంట్లో ఆలోచన విధానంలో రావాల్సిన మార్పులేమిటి?
- బడిలో, చదువుల్లో... రాబోయే తరం పిల్లలకు మనం నేర్పగలిగినది ఏమిటి?
- ఎంపవర్‌మెంట్‌ అనే పదానికి అర్థం ఏమిటి?
- గర్వంగా చెపుతున్నాను.
- విద్యాపరంగా, ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా మనందరి ఏపీ ప్రభుత్వం... మన జగనన్న ప్రభుత్వం మన రాష్ట్రంలో, దేశ మహిళా సాధికారిత చరిత్రలోనే ఒక మహా విప్లవాన్ని తీసుకు వస్తోంది.
- 21వ శతాబ్దపు ఆధునిక భారత స్త్రీ ఆంధ్రప్రదేశ్‌లోనే అవతరిస్తుంది.
- సమాజంలో ఒక నిశ్శబ్ద మహిళా విప్లవం జగనన్న ప్రభుత్వం తీసుకువస్తోంది.

- అయితే ఇదే సమయంలో మనం మరి కొన్ని అంశాలనూ ఆలోచించాలి.

  • మహిళలకు రాజ్యాంగం ఇచ్చిన హక్కులేమిటి?
  • మహిళల గురించి, సమానత్వం గురించి మన రాజ్యాంగం ఏం చెపుతోంది?
  • మహిళలకు రక్షణ ఇస్తున్న చట్టాలేమిటి? వాటి వివరాలేమిటి?
  • మొబైల్‌ వాడకంలో యాప్‌లు, సోషల్‌మీడియా వల్ల లాభాలేమిటి? నష్టాలేమిటి?
  • ప్రభుత్వం ఇస్తున్న మద్దతు ఏమిటి?
  • చదువుకున్నా మన చట్టాల గురించి మన హక్కుల గురించి మనకు తెలియకపోవటం వల్ల జరుగుతున్న నష్టాలేమిటి?
  • వీటన్నింటి గురించి... నాకు తెలిసిన విషయాలను ఏపీ లా పాయింట్‌ వెబ్‌సైట్‌ ద్వారా మీ ముందు ఉంచుతాను.
  • నేను మాట్లాడతాను... మీరూ మాట్లాడండి!


- మహిళలకు ఇంటినుంచి సమాజం వరకు ఎక్కడ చూసినా అన్యాయం జరుగుతోందని బాధపడకండి.

     - నేను మాట్లాడతాను... మీరూ మాట్లాడండి!

  • పరిస్థితులెలా ఉంటాయో అవగాహన పెంచుకోవాలి.
  • ఎలా ఎదగాలో ఆలోచించాలి.
  • ఎలా మన రెక్కలు మనం బలపరుచుకోవాలో నిర్ణయించుకుని అడుగులు ముందుకు వేయాలి.
  • సమాజంలో వస్తున్న మార్పులను ఎదుర్కొని నిలబడటం ఎలా అన్న ఆలోచన ప్రతి ఒక్కరూ చేయాలి.
  • మనకు మనం బలపడాలి.
  • ఒక్కటి గుర్తుంచుకోండి... న్యాయ దేవత కూడా ఒక స్త్రీయే!
  • స్త్రీకి న్యాయం జరుగుతుందన్న నమ్మకంతో...
  • న్యాయం కోసం పోరాడాలన్న తపనతో...
  • అలా పోరాడేవారికి నాకు తెలిసిన విషయాల్ని షేర్‌ చేయాలన్న మంచి ఆలోచనతో...ఈ పోర్టల్‌ ప్రారంభిస్తున్నాను.